Monday 26 June 2017

శిరసు వంచకుమిక శ్రీ నరసింహా! నీ సిరులెన్నైనా గలవు శ్రీ నరసింహా! - అన్నమయ్య కీర్తన


అన్నమయ్య కీర్తన

శిరసు వంచకుమిక శ్రీ నరసింహా! నీ
సిరులెన్నైనా గలవు శ్రీ నరసింహా!

చెలి నీ తొడపై నెక్కె శ్రీ నరసింహా
చెలరేగె నీ మోము శ్రీ నరసింహా
సెలవులు నవ్వు దేరె శ్రీ నరసింహా నీమై
చెలప చెమటలుబ్బె శ్రీ నరసింహా !!

చేరడేసి కన్నుల శ్రీ నరసింహా
చీరుమూరాడీ వలపు శ్రీ నరసింహా
చీరకొంగంటేవేమీ శ్రీ నరసింహా
చేరె నీకు నా మేలు శ్రీ నరసింహా !!

చేవల్లకు వచ్చితివి శ్రీ నరసింహా నా
సేవలెల్లా మెచ్చితివి శ్రీ నరసింహా
శ్రీ వేంకటాద్రి మీది శ్రీ నరసింహా
చేవమీరె నీ వేడుక శ్రీ నరసింహా  !!

తాత్పర్యం.. ఓ నరసింహస్వామీ! ఇక నీ శిరసును వంచకయ్యా! నువ్వు చూడవలసిన కాంతులు, సంపదలు ఎన్నో ఉన్నాయి.
ఓ నరసింహస్వామీ! నీకు ఇష్తమైన చెలి లక్ష్మీదేవి నీ తొడపైకి ఎక్కింది.  అందుకే గామోసు నీ మొగం కాంతితో విజృంభిస్తోంది. అవును స్వామీ నీ పెదవుల మూలలో(సెలవుల) నవ్వులేమిటి? నీ చెంపలమీద  ఆ చెమటలు ఉబ్బిపోతున్నాయి. ఏమిటి కథ?
శ్రీ నరసింహా! నీ కళ్ళు విశాలంగా ఉంటాయి. ఆ పెద్ద కళ్ళు తెరచి నీ వలపుతో చిందరవందర (చీరుమూరాడు) చేస్తున్నావేమిటి? నా చీరకొంగు పట్టుకుంటావేమిటి? నీకు నా మేలు చేరింది కదా.. ఇంకా ఈ వేషాలేమిటి?
ఓ నరసింహా! నా సమీపానికి చేతికి అందేటట్లు వచ్చావు. తమరికి చేసుకున్న అన్ని రకాల సేవలను మెచ్చు కొన్నావు. శ్రీ వేంకట పర్వతముపై వెలసిన శ్రీ నరసింహా! నీ వేడుక హద్దుమీరి పోతూంది.
అన్నమయ్య వేంకటేశుని తర్వాత నరసింహస్వామిపై ఎక్కువ కీర్తనలు వ్రాసాడు. నరసింహుని రూపాలలొ లక్ష్మీ నరసింహ రూపము  చాలా ప్రసిధ్ధమైనది. ధర్మపురి, అంతర్వేది, యాదగిరి, సింహాచలం, వాడపల్లి, మంగళగిరి - ఇలా తెలుగు రాష్త్రాలలో లక్శ్మీ నరసింహస్వామి దేవాలయాలు ఎన్నో చూసి పట్టలేని ఆనందంతో అన్నమయ్య ఇటువంటి కీర్తనలు ఎన్నో రచించాడు. ఒకో కీర్తనలో ఒకో రకంగా నరసింహస్వామిని వర్ణించాడు.

No comments:

Post a Comment