Monday 15 May 2017

నీవే రక్షింతువు గాక నిన్ను నమ్మితిమి మేము అన్నమయ్య కీర్తన.

ఈ వారం అన్నమయ్య కీర్తన.
నీవే రక్షింతువు గాక నిన్ను నమ్మితిమి మేము
దైవమవై నీవుండగ తగ మాదే బ్రతుకు.
కోరి వొకరాతివీరు గొల్చి బతికీనొకడు
పైరు వొక్క చెట్టువెట్టి బతికేననీ నొకడు
కూరిమి బాము చేపట్టుకొని బతికీ నొకడు
శ్రీరమణుని దాసుల చేతిదేపో భాగ్యము.
ఇసుమంత మన్ను వట్టి యేచి బతికీ నొకడు.
పసురము నింటగట్టి బతికేననీ నొకడు
పసగా వేలె డినుము పట్టి బతికీ నొకడు.
వశుధేశ నీవు గలవారి కేమి గడమ.
ఆకునలము గసవునంటి బతికీ నొకడు
లోకులు పెక్కుపాయాల లోలులై బతికీ రదే
యీకడ శ్రీ వేంకటేశ ఇవెల్లా నీ మహిమలే
చేకొని నీమరగు చొచ్చినవారే ఘనులు.
అర్ధ పరమార్ధం.
శ్రీ వేంకటేశా! మేము నిన్నే నమ్ముకొని ఉన్నాము. నువ్వు మాకు దైవంగా వుండగా వివిధ వృత్తులలో ఉండే మా భక్తులమందరము మా అభిరుచికి తగినట్లుగా బతుకుతున్నాము. నీ అనుగ్రహం కలిగిన బతుకు మాది.
ఇష్టపడి ఒకడు దేవాలయములో దైవరూపంలో ఉన్న వీరుని విగ్రహాన్ని (రాతివీరు) పూజించి బతుకుతున్నాడు.(పూజారి).
రైతు వేసిన పంత మధ్యలో ఒక చెట్టు పెట్టి దానిమీద వచ్చే ఆదాయంతో ఒకడు బతుకుతున్నాడు.(వ్యాపారి లేదా రైతు).
ప్రేమతో పాముని చేత పట్టుకొని ఆడిస్తూ ఒకడు బతుకుతున్నాడు. (పాములవాడు లేదా గారడీవాడు).
శ్రీకి ఇష్టమైన వేమ్కటేశుని దాసులుగా ఉంటే చాలు - వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా అదృష్టవంతులే.
ఒకడు చాలా మట్టిని పట్టుకొని మదించి, పిసికి బతుకుతున్నాడు. (కుమ్మరి)
పశువులను ఇంట్లో కట్టుకొని (అంటే వాటిని మేపుతూ పాలు మొదలైనవి తీసి అమ్ముకుంటూ) ఒకడు బతుకుతున్నాడు (గొల్లవాడు).
చాతుర్యముతో ఒక చిన్నపాటి ఇనుమును పట్టుకొని, ఆయుధాలు, పనిముట్లు తయాఎఉ చేసి బతుకుతున్నాడు. (కమ్మరి). ఓ భూపతీ నీ దయ ఉన్నవారికి ఏమి కొరత?
ఒకడు గడ్డీ గాదము ఏరుకొని (అంటే వాటిని పీకుతూ, అమ్ముతూ) బతుకుతున్నాడు (రైతుకూలీ, రోజుకూలీ).
లోకులు ఇలా అనేక వృత్తులకు సంబంధించిన ఉపాయాలతొ బతుకుతున్నారు. ఈ ప్రపంచములో ఈ వృత్తులకు సంబంధించిన నైపుణ్యాలన్నీ నీ మహిమలే. ఆదరముతో, భక్తితో నీ శరణు చొచ్చినవారే, నిన్ను శరణన్నవారే ఈ లోకంలో ఘనులు.
సంకలనం, వ్యాఖ్యానం..డా॥ తాడేపల్లి పతంజలి.
LikeShow More Reactions
Comment

No comments:

Post a Comment