Friday 6 March 2015

నూరవద్దు తాగవద్దు నోరు చేఁదుగావద్దు - అన్నమయ్య కీర్తన


అన్నమయ్య కీర్తన: 

ప.     నూరవద్దు తాగవద్దు నోరు చేఁదుగావద్దు
•       
చేరువ నొకచోట సంజీవి వున్నదిదివో. IIపల్లవిII

•       
పొలమెల్లాఁ దిరిగాడి పొడిఁబడనెవద్దు
•       
తలఁకక గడ్డపారఁ దవ్వవద్దు
•       
వలవని వాఁగుల వంకల వెదకవద్దు
•       
చెలఁగి వొకచోట సంజీవి వున్నదిదివో. IIనూరII

•       
మొక్కలానఁ జెరువులో మునిఁగి చూడవద్దు
•       
నిక్కిన పుట్టలమీఁద నెమకవద్దు
•       
వెక్కసానఁ జేతిపైఁడి వెలవెట్టి కొనవద్దు
•       
చిక్కులెల్లాఁ బాపెటి సంజీవి వున్నదిదివో. IIనూరII

•       
దీవులను నోడలెక్కి తిరుగాడనేవద్దు
•       
సోవల బిలములోనఁ జొరవద్దు
•       
కావించి గ్రహణాదికాలము వెదకవద్దు
•       
శ్రీవేంకటనాథుఁడై సంజీవి వున్నదిదివో. IIనూరII


భావం:
 చేదు మందులని నూరుకొని తాగవద్దు. మనకి దగ్గరలో ఉన్న వెంకటనాదుడే సంజీవని. ఇదిగో ఇక్కడనే ఉన్నది.
పొలమంతా తిరిగి అలసిపోవద్దు. గడ్డ పారలతో తవ్వి తవ్వి చూడవద్దు. వాగులలో వంకలలో వెదకవద్దు. ఇదిగో ఒకచోట సంజీవి ఉన్నది.
చెరువులో మునిగి చూడవద్దు. పుట్టలమీద వెదకవద్దు. చేతిలోనున్న బంగారాని పెట్టి కొనవద్దు. చిక్కులన్నిటిని దీర్చే సంజీవి ఇదిగో ఇక్కడనే ఉంది.
ఓడలేక్కి దీవులన్నీతిరుగ వద్దు. కొండ గుహలలో జోరబడి వెదకవద్దు. గ్రహణాల సమయంకోసం ఎదురుచూసి వెదకవద్దు. శ్రీ వెంకటనాధుని రూపంలో సంజీవి ఇక్కడనే ఉన్నది.
మనకి అత్యంత దగ్గరలో ఉన్న పరమాత్ముని కనుగొనలేక ఎక్కడెక్కడో వెదకి వేసారి పోవద్దని అన్నమయ్య ఈ కీర్తనలో విశదీకరించాడు.
(పొన్నాడ లక్ష్మి)


No comments:

Post a Comment