Monday 16 March 2015

తాళ్ళపాక అన్నమాచార్యులు

తాళ్లపాక అన్నమాచార్యుల వర్ధంతి.  ఫాల్గుణ బహుళ ద్వాదశి:
          ఈ రోజు పదకవితాపితామహుడు అన్నమయ్య వర్ధంతి. ఆరువందల సంవత్సరాల క్రితం నారాయణసూరి లక్కమాంబ దంపతులకు సర్వధారి నామ సంవత్సరం వైశాఖ పున్నమి (1408) నాడు తాళ్ళపాక గ్రామంలో జన్మించాడు. ఎనిమిదేళ్ళ వయసులోనే కాలినడకన ఏడుకొండలూ ఎక్కి స్వామిని దర్శించి ‘పొడగంటిమయ్యా నిన్ను పురుషోత్తమా’ అని కీర్తించి తరించిన మహానుభావుడు.
          అన్నమయ్య కీర్తనలలో భక్తీ, శృంగారం, తత్వం, వేదాంతం, జానపదం ఒకటేమిటి అన్ని సారాంశాలు కనిపిస్తాయి, వినిపిస్తాయి.  32,000 కీర్తనలను రచించి తరించిన ఘనాపాటి.  మనకు లబించినవి 14,000 కీర్తనలే అయినా  అవి మన గుండెల్లో, తెలుగువారి లోగిళ్ళలో సజీవంగా ఈనాటికీ వీనులవిందుగా వినిపిస్తున్నాయి. అలతి అలతి పదాలతో అచ్చతెనుగు నుడికారంతో జానపదుల నోళ్ళలో సైతం నానేలా తన పదకవితా వైభవాన్ని ఆవిష్కరించాడు.
          వేంకటేశుని పాదపద్మములనే మనసున నిలిపి భక్తి పారవశ్యంతో మైమరచిపోయేవాడు. అంతలోనే వేడుకుంటూ, మరంతలోనే నిష్టూరమాడుతూ స్వామిని నిలదీసేవాడు. స్వామిపట్ల అంత చనువు, అధికారం అన్నమయ్య ఒక్కడికే స్వంతం.  ఒక కీర్తనలో అయితే ‘నాకు నీ అండ ఉంది నీకెవరున్నారు’ అని స్వామికంటే తనే గొప్పవాడినని స్వాతిసయం చూపిస్తాడు. అంతలోనే అమ్మవారికి ఫిర్యాదు చేస్తాడు.
          ఇవన్నీ ఒక ఎత్తు అయితే మాతృమూర్తులకు అన్నమయ్య వ్రాసిన జోల పాటలు ఒక ఎత్తు. “జో అచ్యుతానంద  జో జో ముకుందా’” అన్న లాలిపాట, పసిపిల్లలకు చందమామని చూపిస్టూ గోరుముద్దలు తినిపిస్తూ పాడే ‘చందమామ రావే పాట నాటినుంచి నేటివరకూ తెలుగింట ప్రతి అమ్మనోట పలుకుతున్నాయి.
          పండితులకే కాకుండా “సామాన్యులకు  సైతం రసజ్ఞత జోడించి చెప్పిన కవి అన్నమయ్య’ అని విద్వాన్ విశ్వం తన మాటలలో చెప్పారు. అన్నమయ్య  ఆనాడే సంఘ సంస్కర్తగా, మహిళా అభ్య్దయవాదిగా వ్యవహరించాడు. ప్రస్తుత సమాజానికి ఏమి అవసరమో అవ్వన్నీ ఆనాడే తన కీర్తనలలో పొందుపరిచాడు. “పరుల మనసుకు ఆపదలు కలుగజేయు పరితాపకరమయిన బ్రతుకేలా” అన్న కీర్తనలో వ్యక్తి నడవడిక ఎలా ఉండాలో వివరించిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు అన్నమయ్య.
 మేలుకొలుపు పాటలు, జోలపాటలు, పెళ్లిపాటలు, సువ్వి పాటలు, విరహపు పాటలు, జాజర పాటలు ఇలా సామాన్య జీవితాలలో ప్రతి దశనూ సంబంధించిన కీర్తనలను అన్నమయ్య మనకు అందించాడు. మొత్తమ్మీద తన జీవిత కాలంలో ముఫయి రెండు వేల సంకీర్తనలు, పన్నెండు శతకాలు, ద్విపద రామాయణం, శృంగార మంజరి, వేంకటాచల మహాత్మ్యం, సంకీర్తన లక్షణం, ఇలా ఎన్నో రచనలు చేసిన అన్నమయ్య అజరామరుడు.
          దుందిభినామ సంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు (1503) అన్నమయ్య శ్రీనివాసునిలో ఐక్యమయ్యాడు. తెలుగు జాతికి తరగని సాహితీ సంపదని అందించిన నా అన్నమయ్య అమరుడు.
          అన్నమయ్య కీర్తనలు ఆంద్ర దేశానికి అమృత గుళికలు.
పోన్నాడ లక్ష్మి – 17.03.2015)

No comments:

Post a Comment