Sunday 25 August 2024

శ్రీకృష్ణతత్వం


 

పద కవితాపితామహుడు అన్నమయ్య  శ్రీకృష్ణుని పై అనేక కీర్తనలను రచించాడు. శ్రీకృష్ణ జననం నుంచి గీతోపదేశం విశ్వరూప దర్శనం వరకూ ఎన్నో కీర్తనలను రచించాడు. అందులో కొన్నినాకు తెలిసినవి .. 

‘సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి-కతలాయె నడురేయి కలిగే శ్రీ కృష్ణుడు’ , అంటూ కృష్ణ జననం, ‘చిన్ని శిశువు చిన్ని శిశువు, ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు’ అంటూ అపురూపమైన చిన్ని కృష్ణుని చేష్టలు అని తన కీర్తనలో  చెప్తాడు.  ముద్దు గారే యశోద ముంగిట ముత్తెము వీడు అని యశోద గారాల తనయునిగా చిత్రీకరిస్తాడు.  ఇంక శ్రీకృష్ణుని అల్లరి పనులు వర్ణిస్తూ , ;పాలు తాగె వెన్నదినె బానల పెరుగు జుర్రె సొలి కాగుల నేతులు చురలాడెనమ్మా’ ఇంకొక కీర్తనలో ముచ్చువలె వచ్చి తన ముంగె మురువుల చేయి తచ్చెటి పెరుగులోన తగవెట్టి – నొచ్చెనని చేయిదీసి నొరనెల్ల చొల్లుగార వొచ్చెటి వాపోవు వాని నూరడించరే’ అని,   గొల్లపల్లెలో సొచ్చి కొల్లలాడిన కొడెకాడు’ అని ఒక కీర్తనలో , వెన్నలెల్ల  తామెసగి కృష్ణుడా ఇంటి చిన్న కోడలి మూతి నించి చమరె – వెన్న మూతి చూచి అత్త వేగమె కోడలి గొట్టె ఇటువంటి కొంటె పనులు ఎన్నో తన కీర్తనలలో మనకి చూపించాడు.

పరమాత్ముడు శ్రీకృష్ణుడు అని తెలియని గొల్ల పడుచులు ; ఏమమ్మా ఊరకుండేవే యశొదమ్మా – ఈ మేంటి బాలకృష్ణు నే మరకువమ్మా.. బండి దన్నె  బట్టరమ్మ  బాలుని పాదము నొచ్చె- కొండనెత్తె నొకచేత గోరి వీడు – పాముబట్టీ  బట్టరమ్మ పసిబిడ్డడే మెరుగు – బూమెల ఈ బాలునికి బుద్ధి చెప్పరమ్మ.ఽని ఒక కీర్తనలొ బండిని తన్నాడు కాలు నొప్పెట్టి ఉంటుంది, కొండ నెత్తాడు, పాముని పట్టాడు పాలు వెన్నలు దొంగలించి పారిపోతాడు,  పాపం  పసివాని కేమి తెలుసు. కాస్త బుద్ధి చెప్పి జాగ్రత్తగా చూసుకొ యశోదమ్మా అని చెప్పినట్లు ఒక కీర్తన.

ఇంకొక కీర్తనలో యశోదకు తనయుని పై మమకారం ‘పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటాను – పొలసి ఆరగించ పొద్దయెనిపుడు కృష్ణుడెక్కడున్నాడో భోజనానికి వేళయింది ఆకలితో ఉంటాడు. యమునలో ఈదులాడుతున్నాడొ, గొల్లభామల చే జిక్కినాడో, సాందీపుని వద్ద చదువుకుంటున్నాడొ. నెమలి చుంగులకోసం వెళ్ళాడో, కూరలన్నీ చల్లారిపోతున్నాయని  కృష్ణుని వెతకి తీసుకు రమ్మని యశోద ఆవేదన ఎంతోహృద్యమంగా అన్నమయ్య వివరిస్తాడు.

మరొక మథుర కీర్తనలో పరమపురుషుడట – పశుల గాచెనట సరవులెంచిన విన సంగతా ఇది. వేదాలకొడయడట వెన్నలు దొంగిలెనట నాదించి విన్నవారికి నమ్మికా ఇది, అల బ్రహ్మ తండ్రి యట యశోదకు బిడ్డడట కొలదొకరికి చెప్పకూడునా ఇది.. ఇవన్నీ నమ్మతగ్గ విషయాలేనా .. అంటూ ఆశ్చర్యపోతూంటాడు అన్నమయ్య.

ఇంకొక అద్భుత కీర్తన..’కనియు గానరు నీ మహిమ – కౌరవ కంస జరాసంధులు – మనుజులు దనుజుల జంపిరనమ్గ విని మరి నీ శరణము చొరవలదా…  ఇందులో  అన్నీ చూస్తూ కూడా నీ మహిమను కానలేకున్నారు కౌరవులు, కంసజరాసంధులు, నీ నోటిలో బ్రహ్మాండమును చూపావు, పూతకి చన్నుద్రావి చంపావు, బండి తన్నావు, కొండనెత్తావు బాలుడు చేసే పనులా ఇవి..  అని అడుగుతున్నట్లు ఉంటుంది. ఇంకా ఎన్నో కీర్తనలు, గోపికలతో సరాగాలు, కోలాటాలు, ఉట్ల పండుగలు అన్నీ అద్భుతంగా వర్ణించాడు. గీతోపదేశం కూడా ఒక కీర్తనలో క్లుప్తంగా చెప్పాడు అన్నమయ్య. ‘భూమిలోనచొచ్చి సర్వభూత ప్రాణులనెల్ల ధీమసాన మోచేటి దేవుడనీనూ—కామించి సశ్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడ నేనూ.. అని ఆనతిచ్చె  కృష్ణుడర్జునునితో, విని ఆతని భజింపుము వివేకమా…



No comments:

Post a Comment