Friday 7 December 2018

ఆక్రోశం.


ఆక్రోశం.

కన్నెప్రాయంలో రెక్కలు విచ్చుకుంటున్న కోరికలు.
పరువాల సందడిలో చెలరేగుతున్న అలజడులు.
తీయని కలల ప్రపంచంలోకి అడుగిడిన లేత మనసు.
పుస్తకాల దొంతరలో ప్రేమలేఖలు, స్నేహితులతో పంపిన రాయబారాలు.
కవ్విస్తున్న చిలిపి చూపులు, చతుర సంభాషణలు వెరసి
పరవశంతో ప్రేమప్రహసనానికి నాంది.
భయభక్తులతో, ఆలోచనలతో వెనుకడుగువేసిన ఆడతనం.
అన్నీ తానె అయి ఉంటానని చేసిన ప్రేమబాసలు.
నమ్మికతో, పెద్దల అనుమతితో జరిగిన కల్యాణం.
కొద్దిరోజులు కొత్తకోరికల మత్తు, ఆపై బయటపడుతుంది అసలు నైజం.
మోజు తీరి బయటపడిన పురుషాహంకారం, అధికారంతో ఇల్లాలిపై జులుం.
పెరిగిన సంసార భారంతొ బరువుగా కదిలిపోయిన కాలం.
వయసుపైబడి, సత్తువ తగ్గి గడుపుతున్న చివరి రోజులు.
అప్పుడే కావాలి ఒకరికొకరి సహకారం, సామీప్యత..
పదవీవిరమణ, విశ్రాంతీ సమయం అతనికి అవసరం.
సమయానుకూలంగా అన్నీ అమర్చిపెట్టడం ఆమె బాధ్యత.
వంటింటికి మాత్రమే పరిమితమై అప్యాయతానురాగాలకి నోచుకోని ఇల్లాలు.
సానుభూతి, సహకారం లేదు, విహారాలు, వినోదాలు అసలే లేవు.
భర్తగల ఇల్లాలికి, భర్తృ విహీనకి తేడాలేని వైనం.
ఒకే గూటి కింద ఉన్నా ఎప్పుడూ మౌనమే రాజ్యమేలుతూంటుంది.
ఆక్రోశించే మనస్సు, అనురాగంకోసం అలమటించే మనస్సు.

-- పొన్నాడ లక్ష్మి

No comments:

Post a Comment