Friday 1 December 2017

పిలువరే కృష్ణుని పేరుకొని యింతటాను పొలసి యారగించే పొద్దాయ నిపుడు - అన్నమయ్య కీర్తన


ఈ వారం అన్నమయ్య కీర్తన.
పిలువరే కృష్ణుని పేరుకొని యింతటాను
పొలసి యారగించే పొద్దాయ నిపుడు
వెన్నలారగించ బోయి వీధులలో దిరిగీనో
యెన్నరాని యమునలో యీదులాడీనో
సన్నల సాందీపనితో చదువగ బోయినాడో
చిన్నవాడాకలి గొనె చెలులాల యిపుడు
మగువల కాగిళ్ళ మఱచి నిద్దిరించీనో
సొగిసి యావుల గాచే చోట నున్నాడో
యెగువ నుట్లకెక్కి యింతులకు జిక్కినాడో
సగము వేడికూరలు చల్లనాయ నిపుడు
చెంది నెమలి చుంగుల సింగారించుకొనీనో
ఇందునే దేవరవలె ఇంటనున్నాడో
అందపు శ్రీవేంకటేశు డాడివచ్చె నిదె వేడె
విందుల మాపొత్తుకు రా వేళాయ నిపుడు
భావమాధుర్యం... శ్రీకృష్ణుడు ఎక్కడున్నాదో పిలవండమ్మా. చాలా పొద్దెక్కిపోయింది. భొజనం ఆరగంచాలి.
వెన్నలు ఆరగించాలని వీధులలో తిరుగుతున్నాడో! ఆ యమునలో జలకాలాడుతూ ఈత కొడుతున్నాడో! లేక సాందీపుని దగ్గరికి వెళ్ళి చదువుకుంటున్నాడో! చిన్నవాడు ఆకలితో ఉంటాదు తీసుకు రండమ్మా..
మగువల కౌగిళ్ళలో ఆదమరిచి నిద్రపోతున్నాడో లేక గోవులను కాచుతున్నాడో! అల్లరి చేస్తూ ఎత్తుగా ఉన్న ఉట్లకోసనమెక్కి గోపెమ్మల చేతికి చిక్కినాడో! వంటకాలు, కూరలు అన్నీ చల్లారిపోతున్నాయమ్మా...
సింగారించుకుందుకు నెమలికన్నులు తెచ్చుకుందామని వెళ్ళాడో! లేక ఇక్కడే ఎక్కడో దేవరవలె నున్నాడో! అందంగా శ్రీవేంకటేశుడై ఆడుకొని వచ్చాడు ఇదిగో వీడే.. ఇంట్లో విందులకు మాత్రం వేళయిపోయినా రాడమ్మా..
ఈ కీర్తనలో అన్నమయ్య అమ్మ మనసు ఎంత బాగా వ్యక్తీకరించాడో చూడండి. పరమాత్ముడైనా అమ్మకి పసిబిడ్డే. చిన్నవాడు ఆకలితో ఉంటాడు. వెదకి తీసుకురమ్మని గోపికలతో చెప్తూంది, ఆటలకే వెళ్ళాడో, గురువుదగ్గరకి చదువుకోసమే వెళ్ళాడో? కొడుకు కోసం ప్రీతితో చేసిన కూరలన్నీ చల్లారిపోతున్నాయని ఆవేదన. పసివాడు, ఆకలి ఎరగడు, అల్లరి చేసి గోపెమ్మల చేతికి చిక్కినాడో ఏమో! వానిని వెదకి తీసుకు రండమ్మా అని గోపికలతో విన్నవించుకుంటూ అమాయకత్వంతో యశోదమ్మ పరి పరి విధాల ఆలోచిస్తూ ఎదురు చూపులు చూసే వైనం అన్నమయ్య చక్కగా వివరించాడు.

No comments:

Post a Comment