Friday 27 October 2017

ఎప్పుడు గాని రాడో యెంతదడవాయ కాలి - చప్పుడాలకించి మతి జల్లురనెనమ్మా - అన్నమయ్య కీర్తన



ఈ వారం అన్నమయ్య కీర్తన.
ఎప్పుడు గాని రాడో యెంతదడవాయ కాలి -
చప్పుడాలకించి మతి జల్లురనెనమ్మా
ఇద్దరమదరిపాటు యేకాంతాన నాడుకొన్న -
సుద్దులు దలచిమేను చురుకనెనమ్మా
పెద్దగా కస్తూరిబొట్టు పెట్టిననాతడు గోర
తిద్దుట దలచి మేను దిగులనెనమ్మా
పాయక యాతడూ నేనుఁ బవ్వళించే యింటివంకఁ
బోయి పోయి కడుఁ జిన్నబోతి నోయమ్మా
తోయపు గుబ్బల చన్నుదోయి మీద వాడొత్తిన
పాయపుఁ జంద్రుల జూచి భ్రమసితినమ్మా
కూడిన సౌఖ్యములందు కొదలేని వాని నా -
వేడుక మతిఁ దలచి వెరగాయ నమ్మా
యీడులేని తిరువేంకటేశుడిదె నాతోడో
నాడినట్టే నాచిత్తమలరించే నమ్మా
భావం :
అలెమేలుమంగమ్మ తన స్వామికోసం ఎదురుచూస్తూ గడపిన మధురక్షణాలను తలచుకుంటూ వ్యక్తపరచిన భావాలను ఈ కీర్తనలో అన్నమయ్య ఎంత బాగా పొందుపరచాడో చూడండి.
ఇంత తడవయినా స్వామి ఇంకా రాడేలనమ్మా ! పాదాల సవ్వడి వినిపించినట్లు మది ఝల్లుమనెనమ్మా. ఏకాంతాన ఇరువరము గడపిన మధుర క్షణాలను తలచి నా మేను జలదరించెనమ్మా. పెద్ద కస్తూరి తిలకము దిద్దుకున్న అతడు గోరుతో నా మోమున తిలకము దిద్దిన క్షణాలు మదిలో మెదిలెనమ్మా. ఇద్దరమూ శయనించే శయనాగారమునకు ఆతడు ఒక్కడే పోవగా చిన్నబోతినమ్మా..నా గుబ్బలమీద తానొత్తిన గుర్తులను చూచి భ్రమసితినమ్మా. స్వామితో కూడిన సౌఖ్యములను మరీమరీ తలచి నా తనువు పులకరించెనమ్మా. సరిలేని శ్రీ వేంకటేశుడు నాతో ఆడిన సరసాలను తలచి నా చిత్తము అలరించినమ్మా.
- పొన్నాడా లక్ష్మి

No comments:

Post a Comment