Wednesday 27 September 2017

దశరా ముచ్చట్లు.




దేవీ నవరాత్రులను దసరా పండగలుగా పిలుస్తారు. పూర్వపు రోజుల్లో దసరా సెలవలప్పుడు ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలలో చదువుకునే బాల బాలికలను వెంటబెట్టుకుని గ్రామం లోని ఇంటింటికీ వెళ్ళే వారు,మా చిన్న తనంలో మేమూ ఇంటింటికీ వెళ్ళి పాటలు పాడి గృహస్తులను ఆనందింపజేసేవాళ్ళం. పిల్లలు కొత్త బట్టలు వేసుకుని చేతుల్లో విల్లంబులు పట్టుకుని అయ్యవారి వెంట వెళ్ళే వాళ్ళం. రంగురంగుల బాణాలు దుకాణాలలో అమ్మేవారు. ఆ బాణాలు పోటీపడి కొనుక్కునేవాళ్ళం.
వీటిని సంధించి వదిలితే, ఎదుటి వారి మీద పూలూ ఆకులు పడేవి. బడి పిల్లలు అలా ఊరంతా తిరుగుతూ పాటలు, పద్యాలు పాడేవారు. వీటినే దసరా పద్యాలు అంటారు. దసరా పద్యాలు చాలా సులభంగా, వీనులకు విందుగా ఉంటాయి. మచ్చుకు ఈ పద్యం చూడండి
ఏ దయా మీ దయా మా మీద లేదు,
ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు,
దసరాకు వస్తిమనీ విసవిసలు పడక
చేతిలో లేదనక అప్పివ్వరనక
పావలా.. .అర్ధయితే ...పట్టేది లేదు,
ముప్పావలా అయితే ముట్టేది లేదు,
హెచ్చు రూపాయయితే పుచ్చుకుంటాము,
అయ్య వారికి చాలు ఐదు వరహాలు
పిల్ల వారికి చాలు పప్పు బెల్లాలు
జయీభవా...దిగ్విజయీభవా
దసరాకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అది బొమ్మల కొలువు. మంచి మంచి బొమ్మలను సేకరించి మెట్లమీద అమర్చి, ఇంకా ఎన్నోరకాలుగా అలంకరించి పిల్లల్ని పిలిచి సందడి చేసుకునేవాళ్ళం. ఆ రోజులే వేరు. ఆ ఆనందాలే వేరు.

No comments:

Post a Comment