Wednesday 6 January 2016

కొలువరో మొక్కరో కోరిన వరములు ఇచ్చి- సులభుడిన్నిటా నిండే సుగ్రీవ నరహరి. - అన్నమయ్య కీర్తన






కొలువరో మొక్కరో కోరిన వరములు ఇచ్చి- సులభుడిన్నిటా నిండే సుగ్రీవ నరహరి.

౧. కంభములోన పుట్టి కనకదైత్యుని గొట్టి – అంబరపు దేవతలకు అభయమిచ్చి
    పంబి సిరి తన తొడపై బెట్టుక మాటలాడి – అంబుజాక్షుడైనట్టి యాదిమ నరహరి.

౨. నానాభూషణములు ఉన్నతి తోడ నిడుకొని – పూనికతో ప్రహ్లాదుని బుజ్జగించి
    మానవులకెల్లను మన్నన చాలా నొసగి – ఆనందముతో నున్నాడదిగో నరహరి.

౩.  మిక్కిలి ప్రతాపముతో మించిన కాంతులతో అక్కజపు మహిమలను అలరుచు
    తక్కక శ్రీ వెంకటాద్రి దాపుకొని – జక్కదనములకేల్లా చక్కని నరహరి.

భావం:  కోరిన వరములను  సులభముగా నొసగే సుగ్రీవ నరసింహుని కొలువరో మొక్కరో!
          స్థంభములో పుట్టి హిరణ్యకశిపుని సంహరించి, ఆకసాన దేవతలందరికీ అభయమునిచ్చి, లక్ష్మీదేవిని తన తొడపై నుంచుకొని మాటలాడే అంబుజాక్షుడయిన నరహరిని కొలువరో!
          వివిధరకములైన ఆభరణములను ఉన్నతముగా ధరించి, ప్రేమతో ప్రహ్లాదుని అనునయించి, మానవులందరి కోర్కెలు తీర్చి ఆనందముగా నున్ననరహరిని సేవించరో!
          అమిత ప్రతాపముతో మించిన కాంతులతో గొప్ప మహిమలతో అలరుచూ, చక్కగా శ్రీ వెంకటాద్రి మీద నెలకొని చక్కదనములకెల్లా చక్కనైన నరహరిని కొలువరో!
         

No comments:

Post a Comment