Monday 26 October 2015

సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి - (మొల్ల రామాయణం)



మొల్ల రామాయణం లోని పద్యం.
సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి రాయి యే
ర్వడ ఒక కాంత  యయ్యెనట, పన్నుగ నీతని పాదరేణు లి
య్యెడ వడి నోడ సోక నిది ఎట్లగునో యని సంశయాత్ముడై
కడిగె గుహుండు రామపదకంజయుగంబు శుభంబు పెంపునన్ .

రామపాదం సోకి రాయి ఒక కాంతగా (అహల్య) అయిందట. ఇప్పుడు నీ పాదం సోకితే నా నావ ఏమౌతుందో అని గుహుడికి సందేహం కలిగిందట.ఎందుకైనా మంచిదని ముందుగా రాముని పాదపద్మములను కడిగి ఆ తరువాతే తన నావను ఎక్కనిచ్చాడట.  ( ఈ సుకుమార కల్పన ఆధ్యాత్మ రామాయణం లోది. వాల్మీకి రామాయణం లో లేదు.)

అయితే ఇదే భావంతో బాపు గారి సంపూర్ణ రామాయణంలో గుహుడికి చక్కని పాట పెట్టారు. గీత రచయిత కొసరాజు గారు ఈ పద్యం ప్రేరణతోనే ఆ పాట రాసారనుకుంటా.
          “నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయనాదంట
          నా నావ మీద కాలుపెడితే ఏమవుతాదో తంట
          దయచూపి ఒక్కమారు కాళ్ళు కడగనీయమంట
          మూడు మూర్తులా నీవు నారాయణమూర్తి వంట.
          రామయ తండ్రి, ఓ రామయ తండ్రి......

- పొన్నాడ లక్ష్మి 

No comments:

Post a Comment