Monday 20 January 2014

భారమయిన వేపమాను పాలుపోసి పెంచినాను

భారమయిన వేపమాను పాలుపోసి పెంచినాను
తీరని చేదేకాక తియ్యనుండేనా ?
పాయదీసి కుక్కతోక బద్దలువెట్టి బిగిసి
చాయకెంత కట్టినాను చక్కనుండేనా ?
కాయపు వికారమిది కలకాలము చెప్పినా
పోయిన పోకలేకాక బుద్ధి వినీనా ?

ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్నా
మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యీనా?
పంచమహా పాతకాల బారిబడ్డ చిత్తమిది...
దంచిదంచి చెప్పినాను తాకి వంగీనా?

కూరిమితో దేలుతెచ్హి కోకలోన బెట్టుకొన్నా
సారెసారె గుట్టుగాక చక్కనుండీనా?
వేరులేని మహిమల వేంకట విభుని క్రుప
ఘోరమయిన ఆశమేలు – కొరసోకీనా?

ఈ కీర్తనలో ఎంత ప్రయత్నించినను సహజ వక్రములయిన్
శరీరము, చిత్తము చెప్పినట్లు వినవని అన్నమయ్య వివరించారు.

వేపచెట్టుకి పాలు పోసి పెంచినా తరగని చేదేగాని తియ్యదనం రాదుకదా? కుక్కతోకని వెదురు బద్దలతో బిగించి తిన్నగా వుండునట్లు కట్టినా తిన్నగా చక్కగా వుండదు కదా? అట్లే మనసునకు ఎంత కాలం బోధించినను దాని దారే దానిది కాని చెప్పిన మంచి వినదు. ఇనప గొడ్డలిని ఎంత లోతయిన నీటిలో వుంచి నానబెట్టినా మెత్తబడదు కదా? అదే రీతిలో పంచమహా పాతకాలు అలవది ఉన్న మనసు ఎంత నొక్కి నొక్కి చెప్పినా మంచి దారికి రాదు. తేలుని ప్రేమగా ఒడిలోని పెట్టుకున్నా మాటిమాటికీ కుట్టునేకాని వూరకుండదు.కాని ఇతర వస్తువులపై ఆశ వదలి వెంకతటేస్వరుని దయని ఆశించినవారికి ఎట్టి కొరతా వుండదు.

ఇది అందరూ గ్రహించిన ఎంతో మేలు జరుగును.

No comments:

Post a Comment