వచన కవిత్వం - ఓ చిన్ని ప్రయత్నం.
Tuesday, 28 February 2023
ఎంతవరకు ఈమనసు
ఎంతవరకు ఈ మనసు అంధకారాన్ని ఎదుర్కొంటుంది?
సమసిపోతుంది ఉదాసీనత ఎప్పుడో ఒకప్పుడు.
సుఖదుఃఖాలు వస్తూ పోతూంటాయి జీవిత సత్యాన్ని తెలుపుతూ.
ఆకురాలుకాలం కొద్దిరోజులు మాత్రమే
ప్రచండ మారుతం వీచినా, అంతరంగంలో అగ్నిశిఖలు రగులుతున్నా
ఆత్మవిశ్వాసాన్ని నిలుపుకొని అడుగు ముందుకు వెయ్యి
పడిలేచే కడలి తరంగాలు తీరాన్ని చేరుతూనే ఉంటాయి
.. పొన్నాడ లక్ష్మి
ఆవేదన - కవిత
ఆవేదన.
గుండె పగిలిపోతూంది మనసు మండిపోతూంది.
అమ్మ మనసులో రగులుతున్న అగ్నిపర్వతం.
ఆడపిల్లకు జన్మనివ్వాలంటే భయం భయం
తనంత తాను వలచి, వలపించుకుని వివాహమనే బంధంలో ఇరికించి
నిత్యం నరకం చవి చూపించే మగాడూ మృగమే..
కులం గోత్రం చూసి పెద్దలు కట్టబెట్టిన మొగుడూ మృగమే..
కట్నకానుకలు అందుకుని, భార్యను నమ్మించి
విదేశాలకు ఉడాయించినవాడు ఒకడైతే,
రాక్షస ప్రవృత్తితో మానసిక హింస పెట్టి కట్టుగుడ్డలతో
ఇంటి నుంచి పారిపోయేలా చేసేది ఒకడు.
ఏ రాయి అయినా ఒకటే కదా! అనిపించే పరిస్థితి.
కళకళలాడుతూ పచ్చని గృహిణిగా తిరుగాడవలసిన అమ్మాయి,
ఏ ముద్దుముచ్చట లేక మోడులా మిగిలితే బాధేగా మిగిలేది.
నేర్చుకున్న విద్య జీవనోపాధి కలిగిస్తుందేమో గానీ,
అతరంగంలో సుళ్ళు తిరిగే బాధను తీర్చగలదా?
ఆత్మస్థైర్యంతో చిరునవ్వు మొహాన పులుముకుని
తల్లితండ్రులను మభ్యపెట్టగలవు కానీ, నీ ఆవేదన తీరేదెలా తల్లీ?
ఎవరతను?
ఎవరతను?
సాయంత్రం హైదరాబాద్ కొడుకు దగ్గరికి ప్రయాణం. కరోనా కారణంగా చాలారోజులుగా ఎక్కడికీ వెళ్ళలేదు.
విశాఖపట్నం స్టేషన్ దగ్గర ఆటో దిగగానే ఓ పోర్టరు పరుగున వచ్చాడు. ఏ బండి ఎక్కాలో చెప్పగానే తన కూలీ డబ్బులు కాస్త న్యాయంగానే అడిగాడు. అయినా నేను బేరమాడబోయాను. “అమ్మా కరువురోజులు మీకు తెలుసుకదా! బ్రిడ్జ్ మీదనుంచి వెళ్ళాలి.” అన్నాడు. మావారు సరే పద అనగానే “అబ్బాయి దగ్గరకా అమ్మా ప్రయాణం. మీ బండి ఇక్కడనుండే బయల్దేరుతుంది. ఏడవ నంబరు ప్లాట్ఫారం మీదకు వస్తుంది. కంగారు లేదు కోచ్ నంబర్ ఎంతమ్మా” అని అడుగుతూనే సామాన్లు నెత్తికెత్తుకున్నాడు. పరుగులాంటి నడకతో ఓవర్ బ్రిడ్జ్ వేపు దారితీసాడు. మావారు అతని వెన్నంటే ఉన్నారు. గబగబా సామానులు ప్లాట్ఫారం మీద దించేసి వెనక్కివచ్చి. ఇంకా నత్తనడక నడుస్తున్న నన్ను చేయిపట్టుకుని జాగ్రత్త్గగా మెట్లన్నీ నిదానంగా దింపాడు.
మా బండి రావడానికి ఇంకా టైం ఉంది. బాగా పరిచయమున్న వ్యక్తిలా రైళ్ళ గురించి, తన వృత్తిలో అనుభవాల గురించి నవ్వుమొహంతో బోలెడు కబుర్లు చెప్పాడు. మాటల్లోనే ట్రయిన్ రానేవచ్చింది. గబగబా కోచ్ లోకి వెళ్ళి, మా బెర్తుల క్రింద సామానులు నీటుగా సర్దేశాడు. అతనికి ఇవ్వాల్సిన డబ్బులుకి మరికాస్త జోడించి చేతిలో పెట్టారు మా వారు. “వద్దు బాబూ~! మీరెంత అన్నారో అంతే చాలు అని నా వేపు తిరిగి “అమ్మా భోజనం తెచ్చుకున్నారా? మంచినీళ్ళు తెచ్చుకున్నారా? లేకపోతే కాంటీన్ కి వెళ్ళి ఏమైనా తీసుకురానా?” అని అడిగాడు అతని ప్రవర్తన నాకు కొంచెం ఆశ్చర్యం, ఆనందం కూడా కలిగించాయి. ఈలోగా బండి కదిలింది. అతను గబగబా క్రిందికి దిగి నడుస్తున్న బండితొనే నడుస్తూ ‘ఉంటానమ్మా..’ అంటూ చేతులు జోడించాడు..
ఎవరతను?. మేమంటే ఎందుకంత అభిమానం..? గత జన్మలో కొడుకా, అన్నదమ్ముడా, తండ్రా… ఎవరు? ఎందుకో అతను అందరితోనూ ఇలాగే ఉంటాడా? లేక మా తోనే అలా ఉన్నాడా? అతని స్వభావమే అంతేనేమో? అని ఆలోచనలో పడ్డాను. కళ్ళు మూసుకున్నా అతని నవ్వు మొహం, అతను చూపించిన అభిమానం నా కళ్ళముందు మెదులుతూనే ఉన్నాయి. ఆలోచనల అలజడిలో బండి స్పీడందుకున్న సంగతే తెలియలేదు.
(ఇది మాకు జరిగిన అనుభవం ఆధారంగా)
చిత్రం : శ్రీ Pvr Murty)
All reactions:
129Avadhanula Rama Rao, Jaya Kolluru and 127 others
Subscribe to:
Posts (Atom)