Saturday, 22 March 2014

అన్నమయ్య కీర్తన :

వెనకేదో ముందరేదో – వెర్రి నేను నా
మనసు మరులు దేర – మందేదొకో....!!
చేరి మీదటి జన్మము – సిరులకు నోమే గాని
యే రూపై పుట్టుదునో – యెరుగ నేను.
కోరి నిద్రించ బరచు – కొన నుద్యోగింతు గాని
సారె లేతునో లేవనో – జాడ తెలియ నేను. !!
తెల్లవారి నప్పుడెల్లా – తెలిసితిననే గాని
కల్లయేదో నిజమేదో – కాన నేను.
వల్లజూచి కామినుల – వలపించే గాని
మొల్లమై నా మేను – ముదిసిన దెరగా. !!
పాపాలు సేసి మరచి – బ్రతుకుచున్నాడ గాని
వైపుగ చిత్రగుప్తుడు – వ్రాయుటెరగ ,
యేపున శ్రీవెంకటేశు – నెక్కడో వెతకే గాని
నాపాలి దైవమని – నన్ను గాచుటెరగా !!

భావం :

వెనుక ఏమి జరిగిందో ముందు ఏమి జరుగనున్నదో, ఏమీ ఎరుగని వెర్రివాడను. నా మనస్సు వివిధమైన కోరికలతో పరిభ్రమించుచున్నది. ఈ ఆశల నుండి నాచిత్తము విడుదల నొందుటకు తగిన మందేదోకదా !
రాబోవు జన్మలో సకల సంపదలు కలగాలని ఆశించి ఇప్పుడెన్నో నోములు నోచుచున్నాను. కాని మరుజన్మలో యే రూపు దాల్చనున్నానో ఎరుగను కదా!
బాగుగా నిద్రించవలెనని మెత్తటి పక్కపరచుకొందును. కాని ఆనిద్రనుండి అసలు లేతునో లేవనో తెలియదు గదా!
ప్రతిదినము తెల్లవారి నిద్రలేచి ప్రపంచమునంతటిని చూచుకొని నాకంతయు తెలియు ననుకొను చుందును. కాని నిద్రలేచాక సుషుప్తిలో శూన్యమైన స్థితియే నిజమో, లేక మేల్కాన్చినప్పుడు శాశ్వతమైన స్థితియే నిజమో తెలియని పిచ్చివాడను కదా! అవకాశము, అదను చూసుకొని కాముకురాండ్రు నాపై వలపుగొనునట్లు చేయుచున్నాను. కాని నా శరీరము మిక్కిలిగా ముదిసియుండుట గుర్తింపజాలకుంటిని కదా !
నిత్యము పాపాలు చేసి మరచి బతుకుచున్నాను కాని, ఈ పాపాలన్నింటిని చిత్రగుప్తుడు లెక్క తప్పకుండా వ్రాయుచున్నాడని తెలియజాలను కదా! శ్రీవేంకటేశ్వరుడు ఎక్కడో ఉన్నాడని మూర్ఖుడనై వెదకుచున్నాను. ఆయన నాపాలి దైవమని, సదా నన్నంటి పెట్టుకొని కాపాడుచున్నాడని ఎరుగనైతిని కదా!
నా మాట :

జీవితము క్షణభంగురము. భూతభవిష్యత్తులను ఎరగము. అయినా పిచ్చి ఆశలతో, వ్యామోహలతో కొట్టుమిట్టాడుతున్నాము. అని అన్నమయ్య ఈ కీర్తనలో చక్కగా వివరించారు.

Tuesday, 18 March 2014

అతడే సకలవ్యాపకుడు ..అన్నమయ్య కీర్తన.

అన్నమయ్య మరో అద్భుత కీర్తన.
ప. అతడే సకల వ్యాపకు – డతడే యీతురబంధువు
డతడు దలంపుల ముంగిట – నబ్బుట ఎన్నడొకో!
చ. సారెకు సంసారంబును – జలనిధు లీదుచు నలసిన
వారికి నిక దరిదాపగు – వాడిక నెవ్వడొకో !
పేరిన యజ్ఞానంబను – పెనుచీకటి తనుగప్పిన
చేరువ వెలుగై తోపెడి – దేవుడదెవ్వడొకో !
౨. దురితపు కాననములలో – ద్రోవటు దప్పినవారికి
తెరువిదే కొమ్మని చూపేడి – దేవుడదెవ్వడొకో !
పెరిగిన యాశాపాశము – పెడకేలుగదనుగట్టిన
వెరవకుమని విడిపించెడి – విభుడిక నెవ్వడొకో
౩. తగిలిన యాపదలనియెడి – దావానలములు చుట్టిన
బెగడకుమని వడినార్పెడి – బిరుదిక నెవ్వడొకో !
తెగువయు దెంపును గలిగిన – తిరువేంకట విభుడొక్కడే
సొగసి తలచినవారికి – సురతరువగువాడు.

భావము:

శ్రీ వెంకటేశ్వరుడే అంతటను వ్యాపించి యున్నాడు. రోగములచే కృశించిన లేదా ఆపదలపాలైన ఆర్తులపాలిటి చుట్టమతడే. ఆ పరమాత్ముడు నా తలపుల ముందు
ప్రత్యక్షమై నాకు లభించుట ఎన్నడో కదా!
మాటిమాటికి సంసార సాగరము నీదుచు అలసిపోయిన జీవులకు రక్షకుడు ఆ దేవుడు తప్ప ఇంకెవడు? అజ్ఞానమను పెనుచీకటి ఆవరించినవేళ దగ్గరి ప్రకాశమై తోచి దారిచూపు మిత్రుడింకొకడేడి? పాపపుటడవులలో దారి తప్పి చరించు వారికి సరియైన దారి చూపగల దేవుడతడు గాక మరొకడు గలడా? పెరుగుతున్న ఆశాపాశము తన్ను బంధించినప్పుడు ధైర్యం చెప్పి విడిపింపగల ప్రభువింకొకదు ఎవడున్నాడు? పైకొన్న ఆపదలనెడు కార్చిచ్చులు తనను చుట్టుముట్టినప్పుడు భీతి చెందకుమని వేగిరమే వచ్చి ఆ మంటలను ఆర్పెడు సూరుడు ఆయన తప్ప మరొకడేడి? ధాత్రుత్వము సంపూర్ణముగా కలిగిన శ్రీ వేంకటేశ్వరుడు ఒక్కడే కల్ప వృక్షమై తోచి కోరికలీడేర్ప గలవాడు.